Published 31 Dec 2023
మీకు మీటింగ్ నడవాలా వద్దా అంటూ మంత్రి… ఇష్టమొచ్చినవాళ్లను పిలుచుకోవడానికి ఇది పార్టీ మీటింగ్ కాదు కదా అన్న ఎమ్మెల్యే… ఇలా చేస్తే మేం ఉండం అని ఎమ్మెల్యే.. ఉండకుంటే వెళ్లండి, మేం నడిపించుకుంటాం కదా అని మంత్రి… ఇలా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో ప్రొటోకాల్ రగడ గందరగోళానికి దారితీసింది. కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై సిద్దిపేట హరిత హోటల్ లో సమావేశం జరిగింది. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్జేజీపైకి మంత్రి పిలవడంతో వాగ్వాదం మొదలైంది. ఓడిపోయిన వారిని వేదికపైకి ఎలా పిలుస్తారంటూ పల్లా అభ్యంతరం తెలపడంతో ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటూ ఆమె క్లియర్ గా చెప్పేశారు.
ప్రత్యేక అతిథి అన్న మంత్రి…
ఎవరినైనా ప్రత్యేక అతిథిగా పిలుచుకునే అధికారం తనకు ఉందని, కలెక్టర్ అభ్యంతరం చెప్పనపుడు అడగడానికి మీరెవరూ అంటూ మంత్రి అన్నారు. దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారీ రగడ అయితది.. ఆయన్ను మేం పిలుచుకుంటే మీకేం ఇబ్బంది అంటూ స్పష్టం చేయడంతో సదరు మీటింగ్ నుంచి MLA రాజేశ్వర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. జనవరి 7వ తేదీన కొమురవెల్లి మల్లన్న కల్యాణం, 21 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో ఈ సమావేశం జరిగిన సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి MLA ఆహ్వానించారు. కానీ జనగామలో తన చేతిలోనే ఓడిపోయిన కొమ్మూరిని స్టేజీపైకి పిలవడం పల్లాకు నచ్చలేదు.