Published 04 Dec 2023
మంత్రుల ఎంపికపై మేథోమధనమా…
ఓడినవారినీ లెక్కలోకి తీసుకుంటారా…
ఇతర పార్టీలపైనా కన్నేసినట్లేనా…
ఇలాంటి అంశాలే ప్రస్తుతం సామాన్య జనాల్లో ఆసక్తికరంగా(Interest) కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాత్రి పాలనా పగ్గాలు చేపట్టనుండగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి, డిప్యుటీ CMలు మాత్రమే ప్రమాణం చేసే అవకాశముంది. అలా అయితే నెక్ట్స్ ప్రమాణ స్వీకారం మంత్రులతో ఉండనుంది. అయితే ఈ మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది. ఇప్పటికే పలువురు సీనియర్ పేర్లను అంచనా వేసుకుంటూ ఉమ్మడి జిల్లాల వారీగా పేర్లు తయారు చేసి సోషల్ మీడియాలో వదలడంతో అది విపరీతమైన చక్కర్లు కొడుతున్నది. సీనియర్లకు మంత్రులుగా ఛాన్స్ ఇవ్వడం కచ్చితమే కానీ.. గెలిచినవాళ్లతోపాటు ఓడిన సీనియర్లను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. CLP సమావేశం ముగిసిన తర్వాత మంత్రుల సెలక్షన్ అనేదే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇతర పార్టీల నుంచీ…
పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ కు ఈ విజయంతో జవసత్వాలు వచ్చినట్లయింది. బొటాబొటీ మెజార్టీయే అయినా ఇపుడున్నవాళ్లంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నవారే, ఎంతో కష్టపడ్డవారే. అలాంటి వారిలో ఎవరిని విస్మరించాలన్నా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. లేదంటే ఎక్కణ్నుంచైనా ప్రమాదం పొంచే ఉంటుంది. చాలామంది సీనియర్లకు పదవులు దక్కనుండగా, గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి గురించి కూడా ఆలోచన చేస్తున్నట్లే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఒకట్రెండు పదవులు దక్కనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు.. BRSకు ఎక్కువ సీట్లు వచ్చింది ఈ జిల్లాల నుంచే కాబట్టి పాత మిత్రులను మళ్లీ కలుపుకొని పోతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికైతే వీరేనా…
నల్గొండ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు మరొకరు.. కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబుతోపాటు జీవన్ రెడ్డి.. మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ.. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి.. ఖమ్మం నుంచి పొంగులేటి, తుమ్మల.. ఇలా ప్రతి జిల్లా నుంచి పేర్లు వినపడుతున్నాయి. వీరితోపాటు ఓడినవారికి కూడా పదవులు కట్టబెట్టి MLCలుగా గెలిపించుకోవచ్చనే వార్తలున్నాయి. కాబట్టి మంత్రివర్గ కూర్పు మాత్రం కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి మంత్రి పదవులు కట్టబెట్టే విషయంలోనూ ఆచితూచిగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ లోనే కాకలు తీరిన యోధులు ఊరికే ఉండరుగా మరి.
జాగ్రత్త పడుతున్న అపోజిషన్
జంపింగ్ జపాంగ్ లు ఉన్నారన్న సమాచారంతో అపోజిషన్ పార్టీ సైతం జాగ్రత్తలు పడుతున్నది. తమ పార్టీ భేటీలోనూ దీనిపైన నిఘా పెట్టినట్లు సమాచారం. గెలిచి ఒక్క రోజు కూడా కాలేదు ఇప్పటికే ఒక MLA.. కాంగ్రెస్ ముఖ్యనేతను కలవడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ఈయనొక్కడే బయటకొచ్చాడు, ఇంకా రావాల్సింది చాలా ఉంది అన్న రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కాబట్టి మంత్రివర్గ కూర్పు వెల్లడయ్యే వరకు ఇలాంటి అనుమానాలతోనే కాలం గడపాల్సి రావడం కామన్.