
Published 17 Dec 2023
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల వ్యవహారశైలిపై రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్(Congress) ముఖ్య నేతలంతా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఏకంగా అలాంటి అధికారుల(Officials) పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామంటూ రేవంత్ ప్రతి సందర్భంలోని స్పష్టం చేశారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లీడర్లలో మార్పు కనిపిస్తున్నట్లే ఉంది. మంత్రి శ్రీధర్ బాబు చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులుండవ్.. గత స్కీమ్ లు, పాలసీలు పనికి వస్తాయనుకుంటే మేం కూడా ఫాలో అవుతాం.. రాబోయే బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తాం.. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను యువత ఆశల్ని నెరవేర్చేలా మా సర్కారు ఆలోచనతో ఉంది.. ముందుగా చెప్పినట్లు TSPSC ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ ను అమలు పరిచేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు.
రేవంత్ సర్కారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అధికారుల తీరుపై పూర్తి స్తబ్ధత కనిపిస్తున్నది. కొంతమంది IAS, IPSల్ని మాత్రమే మార్చిన ప్రభుత్వం గతంలో ప్రటించిన విధంగా ‘రెడ్ డైరీ’ గురించి గుంభనంగా ఉన్నట్లు మాటలు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కక్ష సాధింపులు లేవంటూ కీలక మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇవ్వడంతో ఇక అనుమానాలు తొలగినట్లేనన్న భావన కనపడుతోంది.