BCల కోసం ఏదైనా చేస్తామని, ఇప్పట్నుంచి BC నాయకులు, కార్యకర్తల్ని ఎవరైనా కించపరిస్తే సహించేది లేదంటూ రాష్ట్ర BC మంత్రులు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరుపై మండిపడ్డారు. అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ కోసం తమ సర్కారు ఎన్ని కార్యక్రమాలు చేసినా వాటిని విమర్శిస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో భేటీ అయిన నేతలు.. మీటింగ్ వివరాల్ని తెలియజేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత BCల ఆత్మగౌరవం కోసం KCR ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, కులవృత్తుల్ని ఆదుకునేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏనాడూ తమ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని, నాయకుల్ని ఎప్పుడూ చిన్నచూపు చూసే సంస్కృతి ఉంటుందని విమర్శించారు.
ఇకనైనా హస్తం పార్టీలోని BC లీడర్లు తేరుకోవాలని సూచించారు. తలసానితోపాటు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్ తోపాటు వివిధ కులాల లీడర్లు ఇందులో పాల్గొన్నారు. ఇకనుంచి ప్రతి కులాన్ని చైతన్యవంతం చేసి రాష్ట్రంలో 56 శాతం ఉన్న BCలను బలోపేతం చేస్తామని మంత్రులు అన్నారు.