Published 07 Dec 2023
రేవంత్ రెడ్డి కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల్ని కేటాయించినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఎల్.బి.స్టేడియంలో కార్యక్రమం పూర్తయిన అనంతరం శాఖల్ని అప్పజెప్పినట్లు వార్తలు వెలువడగా.. ఇంతవరకు మంత్రులకు శాఖలు కేటాయించలేదు. అత్యంత సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖను ప్రకటించినట్లు ప్రచారం సాగింది. డిప్యుటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ బాధ్యతలు చూస్తారని.. నల్గొండ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పురపాలక శాఖ.. పొంగులేటి సుధాకర్ రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నియమించారని వార్తలు వచ్చినా ఇంకా ఎవరెవరికి ఏమేం ఇచ్చారో క్లారిటీ రాలేదు.
సీనియర్లకు కీలక శాఖలు
మరో సీనియర్ మంత్రి అయిన దామోదర రాజనర్సింహకు వైద్యారోగ్యశాఖ(Medicla & Health), తుమ్మల నాగేశ్వర్ రావుకు రహదారులు, భవనాల శాఖ.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ(సీతక్క), కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమం.. BC సంక్షేమ శాఖను పొన్నం ప్రభాకర్, పౌరసరఫరాల శాఖ(Civil Supply)ను జూపల్లి కృష్ణారావు చూడనున్నట్లు ప్రచారం జరిగింది.
సచివాలయానికి అమాత్యులు
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సచివాలయానికి చేరుకున్నారు. తమ పేషీలకు వెళ్లి అందరితో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రుల హోదాలో తొలిసారి సెక్రటేరియట్ లో అడుగుపెట్టిన రేవంత్ టీమ్ కు అక్కడి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. నూతన CMకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.