ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ హాట్ హాట్ గా మాట్లాడే మాజీ మంత్రి మల్లారెడ్డి… BRSలో ఎలాంటి పదవులు నిర్వహించారో చూశాం. రేవంత్ రెడ్డితో ఆది నుంచి వైరంతో ఉన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి మల్లారెడ్డి కుటుంబానికి రేవంత్ సర్కారు షాక్ ఇచ్చింది. ఆయన అల్లుడు, మల్కాజిగిరి శాసనసభ్యుడు(MLA) అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు చెందిన భవనాల్ని అధికారులు కూల్చివేశారు.
ఏరోనాటికల్ కాలేజీలో…
హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో గల MLRIT ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీకి పొద్దున్నే చేరుకున్న అధికారులు… అక్కడి భవనాల్ని నేలమట్టం చేశారు. చిన్నదామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారంటూ అధికారులు ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు. దీంతో వాటిని మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు. మర్రి లక్షణ్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతోపాటు మరికొన్ని విద్యాసంస్థలకు రాజశేఖర్ ఛైర్మన్, డైరెక్టర్ గా ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మమతను ఆయన వివాహం చేసుకున్నారు.
గత ఎన్నికల్లో..
మేడ్చల్ MLAగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి గులాబీ పార్టీ టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి తనకు రూ.97 కోట్ల ఆస్తులున్నాయని అఫిడవిట్ లో తెలియజేశారు.