తెలంగాణలో అడుగుపెట్టిన ప్రతిసారీ ప్రధాని మోదీపై భారీ అంచనాలుంటాయి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారుకు ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పుకునే కమలం పార్టీ లీడర్లు.. ప్రధాని ఎక్కుపెట్టే విమర్శనాస్త్రాలే తమకు కలిసివస్తాయని నమ్ముతుంటారు. అందుకే ఆయన ప్రసంగం ఎలా ఉంటుందా అని బీజేపీ శ్రేణులతోపాటు అందరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. మోదీ ఏం మాట్లాడుతారు.. బీఆర్ఎస్ పై విమర్శలు ఎలా ఉంటాయి.. అన్న ఉత్కంఠ కనిపిస్తుంది. గత రెండేళ్ల కాలంలో తెలంగాణకు పలుమార్లు వచ్చిన మోదీ… ఒకట్రెండు సందర్భాలు మినహా ఎప్పుడూ బీఆర్ఎస్ పై పెద్దగా విమర్శలు చేయలేదు. అది కూడా నేరుగా పార్టీ పేరు చెప్పకుండానే కుటుంబ పాలన అంటూ విమర్శించేవారు. కుటుంబ పాలనతోపాటు అవినీతి పరుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అంటుండేవారు. ప్రసంగంలో ఎక్కువ భాగం తమ సర్కారు చేపట్టిన కార్యక్రమాల్నే వివరించారు. అప్పటి ప్రధాని ప్రసంగాలు చూసిన తర్వాత బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఒకింత నిరాశకు గురైనట్లే కనిపించింది. కానీ ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో జరిగిన ప్రోగ్రాంలో బీఆర్ఎస్ పేరుతోపాటు కల్వకుంట్ల కవిత గురించి ప్రస్తావించి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
అక్కడే ఎందుకు ఇలా…
ప్రధాని హాజరైన కార్యక్రమం తెలంగాణది కాదు.. మోదీ మాట్లాడిన ప్రాంతం మహారాష్ట్రకూ సంబంధించి కాదు. పోనీ మహారాష్ట్రలోనైనా మాట్లాడారు అనుకుంటే ఈ మధ్యే అక్కడ బీఆర్ఎస్.. ప్రజల్ని ఆకట్టుకునేలా తయారైంది అని చెప్పవచ్చు. అందుకు భిన్నంగా అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ సభలో బీఆర్ఎస్ పేరు ఎత్తడంపైనే అందరిలోనూ చర్చకు కారణమైంది. తెలంగాణ లీడర్ల గురించి మధ్యప్రదేశ్ లో ప్రస్తావించడంపై కారణాలేంటా అని ఆరా తీయడం మొదలైంది.
చాలాకాలం తర్వాత…
కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని.. ప్రజలు బాగుండాలంటే బీజేపీని ఆదరించాలని అన్నారు. కుటుంబ పార్టీల గురించి మాట్లాడిన ప్రధాని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పై… ఫారిన్ టూర్ నుంచి తిరిగివచ్చిన వెంటనే స్వయంగా మోదీయే విమర్శలు చేయడం సంచలనానికి కారణంగా నిలుస్తున్నది. ఈ ప్రసంగం తెలంగాణ బీజేపీ లీడర్లకు టానిక్ గా మారుతుంది అనడంలో సందేహం లేదన్న మాటలు వినపడుతున్నాయి. ఇదే ఊపు.. మోదీ నుంచి వెలువడిన స్పష్టమైన వైఖరితో ఇక ప్రజల్లోకి వెళ్లి తమ స్టాండ్ ఏంటో సగర్వంగా చెప్పుకునే అవకాశం కలిగిందన్న భావన బీజేపీ లీడర్లలో కనపడుతోంది.