లోక్ సభలో మరో అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి పరస్పర మాటల యుద్ధానికి దిగారు. రాహుల్ పై మోదీ డైరెక్ట్ గా ఎదురుదాడికి దిగడం ఇదే తొలిసారి. హిందువులు(Hindus)గా చెప్పుకుంటున్నవారు దేశంలో ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారంటూ రాహుల్ చేసిన కామెంట్స్ సభలో దుమారం రేపాయి. దేశంలో లక్షలాది మందిపై దాడి జరుగుతుందంటూ మాట్లాడటంతో BJP టాప్ లీడర్స్ మండిపడ్డారు.
వీటిని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబడుతూ హిందువులందర్నీ హింసాపరులుగా తప్పుపట్టడం విపక్షం తీరుకు నిదర్శనమన్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సైతం రాహుల్ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. తిరిగి మాట్లాడిన రాహుల్.. మోదీ, BJP, RSS హిందూ సమాజం కాదని సమర్థించుకున్నారు. ఇలా రెండు పార్టీల అగ్రనేతల వాగ్బాణాలతో సభ గరం గరంగా సాగింది.
కశ్మీర్(Kashmir)ను ముక్కలు చేశారు.. మణిపూర్లో(Manipur) మంటలు రేపారు.. ఇదేనా మీ సర్కారు పాలన అంటూ మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్నివీర్ రద్దుచేస్తామంటూ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత మాట్లాడారు. అగ్నివీర్ గురించి మీకేం తెలుసంటూ రాజ్ నాథ్ స్పందించారు.