
ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్రమోదీ(Narendra Modi) ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ నెల 8న ఎల్.బి.స్టేడియంలో నిర్వహించిన BC ఆత్మగౌరవ సభకు అటెండ్ అయిన మోదీ.. ఇప్పుడు MRPS విశ్వరూప సభకు రానున్నారు. మాదిగ ఉపకులాల విశ్వరూప సభ జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని కీలక ప్రకటన చేసే అవకాశముందన్న మాటలు వినపడుతున్నాయి. ‘సమగ్ర న్యాయానికి నాంది దండోరా-ఛలో హైదరాబాద్’ నినాదంతో MRPS ఈ సభ నిర్వహిస్తున్నది. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు భారీస్థాయిలో హాజరు కానున్నారు.
SC రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ మందకృష్ణ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నది. దీనికి గతంలోనే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అటు మందకృష్ణతో కిషన్ రెడ్డికి ముందునుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ సభకు అటెండ్ అయ్యే ప్రధాని.. ఏం ప్రకటన చేస్తారన్న దానిపై అందరిలోనూ ఇంట్రెస్టింగ్ నెలకొంది.