దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికల్లో తాయిలాలు పెద్దయెత్తున సాగుతున్నాయి. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల కోడ్(Model Code Of Conduct) అమలవుతున్నది. ఈ సార్వత్రిక ఎన్నికల(General Elections) టైమ్ లో భారీగా సొమ్ము పట్టుబడుతున్నది. దేశంలో రోజుకు రూ.100 కోట్లు దొరుకుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇప్పటిదాకా…
మార్చి 1 నుంచి ఇప్పటిదాకా రోజుకు వంద కోట్లకు పైగా స్వాధీనమవుతుంటే… ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, తనిఖీల్లో పెద్దయెత్తున పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం రూ.4,650 కోట్లు పట్టుబడ్డట్లు EC తెలిపింది. 2019 ఎలక్షన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువన్న EC.. ధన ప్రవాహం, ప్రలోభాల్ని అడ్డుకునేందుకు ఇంకా తనిఖీల్ని పెంచుతామని స్పష్టం చేసింది.
ఎన్నడూ లేనంతగా…
మాదకద్రవ్యాల(Drugs)తోపాటు నగదు, మద్యం, ఇతర గిఫ్ట్ ల పంపిణీని అడ్డుకుంటున్నామని CEC తెలిపింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో తాయిలాలు దొరకలేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. తొలివిడత(First Phase)లో 102 నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ సాగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.