నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు(MP) ధర్మపురి అర్వింద్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని CM నివాసానికి వెళ్లిన ఆయన మర్యాదపూర్వకంగా రేవంత్ ను కలుసుకున్నారు. ఈ భేటీలో జగిత్యాల శాసనసభ్యుడు(MLA) డా.సంజయ్ కుమార్ ఉన్నారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేయదలచిన నవోదయ విద్యాలయాలకు ఒక్కో చోట 20 ఎకరాల చొప్పున కేటాయించాలని కోరారు. రెండు జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రతిపాదిత స్థలాలను CMకు సంజయ్ తెలియజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతున్నదని రేవంత్ కు వివరించారు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ సర్వేను వెంటనే పూర్తి చేసి కేంద్రానికి నివేదిక అందజేసేలా చూడాలని, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరయ్యే అవకాశం ఉన్నందున స్థల సేకరణ చేపట్టాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు అర్వింద్ తెలియజేశారు.