
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నేడు నాగర్ కర్నూల్లో పర్యటిస్తారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే నవ సంకల్ప సభకు అటెండ్ అవుతారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కమలం పార్టీనే అన్న మెసేజ్ ను ఈ సభ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసీఆర్ సర్కారుతో హైకమాండ్ వ్యవహరించే తీరుపై ఈ మధ్యకాలంలో రూమర్స్ ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ లీడర్లతో పైకి పోటాపోటీ అంటున్న లోపల అందుకు భిన్నంగా ఉందన్న ప్రచారం వినిపిస్తోంది. ప్రధానంగా దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన కవిత పాత్రపై ఎలాంటి ముందడుగు లేకపోవడం అన్ని వర్గాల్లోనూ అనుమానాలకు తావిచ్చినట్లయింది. దీంతో ఇంటర్నల్ గా ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది.

అయోమయానికి ఫుల్ స్టాప్ పడేనా…
కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు.. పార్టీలో చేరికలు భారీగా ఉంటాయని ఆశలు పెట్టుకున్నారు. అసంతృప్తులుగా ముద్రపడ్డ సీనియర్లను సీక్రెట్ గా కలుస్తూ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది.. బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీనే అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ కాస్త డీలా పడ్డట్టు కనిపించినా, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో సీన్ మొత్తం రివర్సయింది. పార్టీలోకి వస్తానన్న వారు రాకపోగా.. ఉన్న నేతలు జారిపోయే డేంజరస్ సిట్యుయేషన్ ఏర్పడింది. పైగా మెయిన్ లీడర్లలో ఒకరంటే ఒకరికి దూరం బాగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని రాష్ట్రంలో బలమైన పార్టీగా తయారు చేయడానికి నాగర్ కర్నూల్ సభ వేదిక కావాలని కమలం నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేకపోవడంతో వీలైనంత త్వరగా ప్రజల్ని కలుసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా దిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడిపిన నేతలు ఇక రాష్ట్రం బాట పడుతున్నారు.