
Published 07 Dec 2023
కొత్తగా కొలువుదీరబోయే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గ కూర్పు(Ministers List) బయటకు వచ్చింది. ఎల్.బి.స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రేవంత్ సహా మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి.. ఈ రోజు రేవంత్ తోపాటే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో భట్టి విక్రమార్క డిప్యుటీ CMగా బాధ్యతలు చేపట్టబోతుండగా.. ఈ లిస్ట్ ను ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు.
18 మందికి అవకాశం
రాష్ట్రంలో 119 శాసనసభ్యులతోపాటు ఒక నామినేటెడ్ తో కలిపి 120 మంది MLAలు ఉంటారు. అందులో 15 శాతం మందికి అంటే 18 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. పైన తెలిపిన మంత్రుల జాబితాలో ఒకరు లేదా ఇద్దరిని కూడా చేర్చబోతున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి కొండా సురేఖకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇద్దరు ముగ్గురు మంత్రులనే ప్రకటించాలని అనుకున్నా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మొత్తంగా 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం(3) నుంచి భట్టి, తుమ్మల, పొంగులేటి.. నల్గొండ(2) నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి.. కరీంనగర్(2) నుంచి పొన్నం, శ్రీధర్ బాబు.. వరంగల్(2) నుంచి సీతక్క, సురేఖ.. నిజామాబాద్(1) నుంచి సుదర్శన్ రెడ్డి.. మెదక్(1) నుంచి దామోదరకు చోటు దక్కింది.