మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 10 Jan 2024
విద్యుత్తు రంగ పరిస్థితి, ఒప్పందాలకు కేటాయించిన నిధులపై ఇప్పటికే శాసనసభ సమావేశాల్లో(Assembly Sessions) శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ అంశాన్ని అంత తేలికగా తీసుకునేలా కనపడటం లేదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన విద్యుత్తు ఒప్పందాల(PPA) కథంతా బయటకు తీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ERC) నుంచి పొందిన అనుమతులు, కొనుగోలు చేస్తున్న ధరల వంటి అంశాలతో కూడిన నివేదిక(Report)ను తనకు అందించాలని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ తీరుపై CM ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. 24 గంటల నిరంతర కరెంటు సరఫరా, ఆరు హామీల్లో ఒకటైన గృహజ్యోతి కింద వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఇక కొత్త విద్యుత్తు విధానం…
ఇప్పటిదాకా స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే విద్యుత్తు రంగం అస్తవ్యస్థంగా మారిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమగ్ర విధానం తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు. విద్యుత్తు రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి, శాసనసభలోనూ అన్ని పక్షాలతో చర్చించిన మీదటే మెరుగైన పద్ధతికి శ్రీకారం చుట్టాలని CS శాంతికుమారితోపాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యుత్తు వాడకాన్ని అరికట్టడంతోపాటు సప్లయ్ లో ఇబ్బందులు తలెత్తుకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.