ముస్లింల పట్ల తమకు ఎలాంటి కోపం లేదని, మజ్లిస్ పార్టీపైనే తమ కోపమంతా అని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలను అడ్డుపెట్టుకుని గూండా రాజకీయాలు చేస్తున్న ఒకే కుటుంబం MIM అంటూ ఆయన విమర్శించారు. మజ్లిస్ పార్టీ పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపైనే కోపం తప్ప ముస్లింల పట్ల ఎలాంటి కోపం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కమలం పార్టీ గెలిస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తామని, అసలు హైదర్ ఎవరు.. ఆ పేరు ఎందుకుండాలి అని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో నగరాల పేర్లు మారాయని, ఇప్పుడు ఆ కోవలోనే తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధాని పేరు తప్పకుండా మారుస్తామని తెలియజేశారు.
ముందే ఎందుకివ్వలేదు…
ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదన్న ఆయన.. నిధుల చెల్లింపు విషయమంతా పెద్ద నాటకమని తెలిపారు. ‘ముస్లింలకు BJP వ్యతిరేకం కాదు.. మా లక్ష్యమంతా పాతబస్తీని డెవలప్ చేయడమే.. BRS, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయి.. కుటుంబ పార్టీలను భారతీయ జనతా పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నటికీ వదిలిపెట్టదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.