
వీడియోలు బయటకు వచ్చి సంచలనం రేపడం వల్లే మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి స్పందించారని, ఆ వీడియోలే గనుక బయటకు రాకపోతే మోదీ నోరు విప్పేవారే కాదని విపక్ష MP గౌరవ్ గొగొయ్ విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. మణిపూర్ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా అక్కడి ముఖ్యమంత్రిని మార్చలేదని మండిపడ్డారు. ‘PM ఎన్నడూ నోరు విప్పరు.. ఒక్క మణిపూర్ గురించే కాదు.. చైనా చొరబాట్లపై స్పందించరు.. అదానీ కంపెనీలపై ఆరోపణలు వచ్చినపుడు మాట్లాడరు.. పుల్వామా దాడుల గురించి చర్చించరు.. మణిపూర్ పై 30 సెకన్లు మాట్లాడేందుకు మోదీకి 80 రోజులు పట్టింది’ అని గొగొయ్ విమర్శించారు.
ఇప్పటివరకు ప్రధాని ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అవిశ్వాసం నెగ్గదని తెలిసినా తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, మోదీ మాట్లాడాలన్న ఉద్దేశంతోనే తీర్మానానికి ముందుకు వచ్చామన్నారు.