హైదరాబాద్ ఇందిరా పార్క్(Indira Park) వద్ద రేపు BJP చేపట్టబోయే ధర్నా(Dharna)కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ లీడర్లు హైకోర్టును ఆశ్రయించనున్నారు. పేదలకు పక్కా ఇళ్లు కేటాయించాలంటూ.. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కమలం పార్టీ మంగళవారం నాడు ఇందిరాపార్క్ ధర్నాకు పిలుపునిచ్చింది. రేపటి ధర్నాకు అనుమతి కోసం ఆ పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలంటూ.. వాటి లబ్ధిదారుల విషయంలో సరైన పద్ధతి పాటించడం లేదని BJP రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఈ ధర్నాలను ఒక్కో జిల్లాలో ఒక్కో సీనియర్ లీడర్ పర్యవేక్షించేలా కార్యక్రమం తయారు చేశారు. ఈటల రాజేందర్ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట, డీకే అరుణ గద్వాలలో, జగిత్యాల కలెక్టరేట్ ఎదుట MP ధర్మపురి అర్వింద్ తోపాటు వివిధ జిల్లాల్లో పలువురు సీనియర్ నేతలు ఈ ధర్నాలకు నేతృత్వం వహిస్తారు.