
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు సీట్లను BCలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గాంధీభవన్ లో సమావేశమైన ‘రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC)’ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ సహా సీనియర్ లీడర్లంతా అటెండ్ అయ్యారు. 3 గంటల పాటు ఈ భేటీ కొనసాగగా.. పార్టీ బలోపేతం, సెగ్మెంట్లలో పనితీరుపై చర్చించింది. అసెంబ్లీ స్థానాల్లో తక్షణం అభ్యర్థులను గుర్తించాలని, వచ్చే ఎలక్షన్లలో అనుసరించే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్న అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు స్థానాలు మొత్తంగా 34 సీట్లను BCలకు కేటాయించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వచ్చే 100 రోజుల్లో ప్రచారాన్ని వేగవంతం చేయాలని, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించాలని పార్టీ నిర్ణయించింది.
చేరికలపైనే ప్రధాన దృష్టి
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వైపు చూసే లీడర్లపైనే ప్రధానంగా దృష్టి సారించాలని లీడర్లు భావిస్తున్నారు. చేరికలతో వచ్చే కొత్త నాయకుల వల్ల సెగ్మెంట్లలో అసమ్మతి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని, టాప్ లీడర్లతో రెగ్యులర్ గా సభలు నిర్వహించాల్సి ఉందని పలువురు సూచించారు. ఈ నెల 30న జరిగే కొల్లాపూర్ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని మధుయాస్కీ తెలిపారు.