అధికారంలో ఉన్న పార్టీకే జైకొడుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు వలసలు పెరిగిపోతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు(Crucial Changes) కనపడుతున్నాయి. ఒక పార్టీలో ఉన్న లీడర్లు కొన్ని గంటల్లోనే వేరే పార్టీలో చేరిపోతూ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ విషయంలో భారత్ రాష్ట్ర సమితి(BRS)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయినప్పటి నుంచి ముఖ్య నేతల వలసలతో గులాబీ పార్టీకి చిక్కులు తప్పడం లేదు.
కవిత కేసుతో…
లోక్ సభ అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారాన్ని ఉద్ధృతం(Speedup) చేయాల్సిన పరిస్థితుల్లో BRS తీరు ఆందోళనకరంగా తయారైంది. KTR, హరీశ్ రావు సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలో ఉండటంతో ఇక్కడ ప్రచారం ఊపందుకోలేదు. గతంలో రెండు నెలల ముందుగానే ప్రచారం మొదలుపెట్టే గులాబీ పార్టీ.. ఈసారి చాలా దూరంలో ఉండిపోయింది. కవితను అరెస్టు చేయడం, ED కస్టడీకి తీసుకోవడం వంటి పరిణామాలతో ఆత్మరక్షణ(Self Defence)లో పడిపోయారు గులాబీ పార్టీ అగ్రనేతలు.
సీనియర్ కేకే సైతం…
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమంలో గళాన్ని గట్టిగా వినిపించిన కె.కేశవరావు గతంలోనే BRS తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సీనియారిటీని గౌరవించిన KCR.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మీని GHMC మేయర్ చేశారు. ఇప్పుడా తండ్రీకూతురు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. కేకేతోపాటు విజయలక్ష్మీ సైతం కాంగ్రెస్ ఇంఛార్జి దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు. గతంలో PCC అధ్యక్షుడిగా పనిచేసిన కేకేను కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చిన మున్షీ దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. లోక్ సభ అభ్యర్థుల సెలక్షన్ నడుస్తున్న తరుణంలో KKను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే కీలక నేతలంతా…
గులాబీ పార్టీ అధికారం కోల్పోయాక ఇప్పటికే పలువురు MPలు, MLAలు కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు. చేవెళ్ల సిట్టింగ్ MP రంజిత్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ఏకంగా MP టికెట్లు సాధించారు. ఇప్పటికే ఆ పార్టీ లీడర్లు కొందరు BJPలో చేరారు. హుజూర్ నగర్ మాజీ MLA శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్, జహీరాబాద్ MP బీబీ పాటిల్ పార్టీ మారారు. ఇప్పుడు కేకే సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారంతో BRS పరిస్థితి అయోమయంగా తయారైంది.