పదేళ్లుగా చేతిలో దేశ రాజధాని పీఠం… మూడుసార్లు ముచ్చటగా అధికారం… పలు రాష్ట్రాల్లో పోటీ చేసి జాతీయస్థాయి హోదా… ఇలాంటి ఘనతలన్నీ అరవింద్ కేజ్రీవాల్ సొంతం. సామాన్యుడిగా ఎన్నికల బరిలోకి దిగి సామాన్యుడిలా అధికార పీఠం సాధించిన ఆయన.. చివరకు అపఖ్యాతి నడుమ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓడిపోవడానికి BJP కారణమైతే ఆయన్ను ఓడించిన వ్యక్తీ చరిత్ర సృష్టించారు. అలాంటి ఘనతను దక్కించుకున్నారు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. రౌండ్ రౌండ్ కు పర్వేశ్-కేజ్రీవాల్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు పర్వేశ్ కు 25,057 ఓట్లు.. కేజ్రీవాల్ కు 22,057 ఓట్లు పోలవడంతో 3 వేల ఓట్లతో ఆప్ అధినేత ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పర్వేశ్.. CM రేసులో నిలిచారు.
ఎవరీ పర్వేశ్ వర్మ…!
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పర్వేశ్ వర్మ.. BJP సీనియర్ లీడర్, ఢిల్లీ మాజీ CM సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. పర్వేశ్ అంకుల్ సైతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేసి 2013లో కమలం పార్టీ అభ్యర్థిగా ముడ్కా సెగ్మెంట్ నుంచి పోటీకి దిగారు. 1977లో పుట్టిన పర్వేశ్.. కిరోరీ మాల్ కాలేజీలో B.A.చదివి ఆ తర్వాత MBA పూర్తి చేశారు. 2013లో పాలిటిక్స్ లోని ఎంట్రీ ఇస్తూనే మెహ్ రౌలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో పశ్చిమ ఢిల్లీ MPగా గెలిచాక, 2019లోనూ 5.78 లక్షల ఓట్ల భారీ మెజార్టీలో మరోసారి విజయం సాధించారు. MPగా పలు స్టాండింగ్ కమిటీల్లో సేవలందించారు. ఈ ఎన్నికల్లో పర్వేశ్… ‘కేజ్రీవాల్ ను సాగనంపడి-దేశాన్ని రక్షించండి’ అన్న నినాదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. AAP పాలన, ఢిల్లీ కాలుష్యం, మహిళల భద్రతపై సర్కారు లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగేలా ప్రచారం చేశారు.