
గత తొమ్మిది సంవత్సరాలుగా RTC గుర్తుకు రాలేదా అని PCC ప్రధాన కార్యదర్శి పటోళ్ల రఘువీర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీని విలీనం చేయడమనేది ఎన్నికల స్టంట్ అన్నారు. ఆ సంస్థకు ఉన్న వేల కోట్ల ఆస్తులపై కన్ను వేసి ఈ విలీనం కుట్రకు తెరతీశారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. సంస్థ ఉద్యోగులకు ఇప్పటికే వందలాది కోట్లు బాకీ పడ్డారని.. అటు వడ్డీలు, పింఛన్లు, లోన్లు అందించేందుకు గాను CCSకే రూ.1200 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉందని కానీ వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు విలీనమంటూ నాటకాలు ఆడుతున్నారని రఘువీర్ విమర్శించారు.
2013 నుంచి ఎరియర్స్ తోపాటు రెండు PRCలు అందించాలన్న రఘువీర్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని RTCని ఎటూ కాకుండా చేశారని, బాకీ పడ్డ నిధుల కోసం సిబ్బంది కోర్టుకు వెళ్తే వారిపై కక్ష పెంచుకుని అవస్థల పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో సమ్మె చేస్తున్నప్పుడు కార్మికులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విలీనం అంటూ ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ ను ఆర్టీసీ ఎంప్లాయిస్ నమ్మబోరని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న పటోళ్ల.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ ఆదుకుంటామని భరోసానిచ్చారు.