ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మొత్తం రూ.3.02 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికీ సొంత ఇల్లు, కారు లేదన్నారు. వారణాసి నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న ఆయన.. చేతిలో రూ.53,920 నగదు మాత్రమే ఉందని, రూ.2.85 కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఉన్నాయని వివరించారు.
బంగారం రూపంలో…
తనకున్న నాలుగు బంగారు ఉంగరాల(Gold Rings) విలువ రూ.2.67 లక్షలుగా పత్రాల్లో మోదీ పొందుపరిచారు. జాతీయ పొదుపు పథకాల్లో రూ.9.27 లక్షలు ఉండగా.. పొదుపు ద్వారా 2019లో రూ.2 లక్షల వడ్డీ వచ్చినట్లు తెలియజేశారు. తనకున్న ఏకైక ఆదాయ మార్గం ప్రభుత్వ జీతమేనని, తన పేరిట ఎలాంటి రుణాలు(Loans) లేవని గుర్తు చేశారు.
చదివింది…
1967లో గుజరాత్ SSC బోర్డు నుంచి టెన్త్, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత గుజరాత్ వర్సిటీ నుంచి MA పట్టా అందుకున్నట్లు మోదీ తెలిపారు. జశోదాబెన్ ను తన శ్రీమతిగా చెబుతూనే ఆమె ఆదాయ వివరాలు మాత్రం తెలియదన్నారు. తనపైన ఎలాంటి కేసులు గానీ ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు లేవని అఫిడవిట్ ద్వారా ప్రధాని తెలియజేశారు.