Published 28 Nov 2023
BRS పాలనలో పరీక్ష పేపర్ల లీకేజే అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరలేదని, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతూ వ్యవస్థనే కొల్లగొట్టారని విమర్శించారు. జహీరాబాద్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన ప్రియాంక.. KCR సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చుకున్న తెలంగాణకు ఈ పాలనలో అర్థమే లేకుండా పోయిందని గుర్తు చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని, పిల్లలకు చదువులు లేవు.. యువకులకు ఉద్యోగాలు లేవన్నారు. గ్యాస్ సిలిండర్లు, డబుల్ బెడ్ రూమ్ లు ఇలా అన్ని పథకాల్లోనూ పేదలకు అన్యాయమే జరిగిందన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా వేలాది మంది రైతులు కాళ్లరిగేలా తిరిగారని, తెలంగాణలో ఎంతోమంది యువకులు, రైతులు బలిదానాలు చేసుకోవాల్సిన దారుణ పరిస్థితులున్నాయని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆమె.. పేదలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు.