ఇప్పటికే అన్ని వర్గాలకు వివిధ పథకాలు(Schemes), హామీలు(Guarantees) ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో హామీ ఇచ్చింది. 18 సంవత్సరాలు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ లు అందిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు రాహుల్ తోపాటు ప్రియాంక అటెండ్ అయ్యారు. కేవలం తెలంగాణలోనే కాదని, దేశం మొత్తం మీద BJPని ఓడిస్తామని ఆమె అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని, గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక గల్ఫ్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గుర్తు చేశారు. అధికార BRS ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉందని, BJP ఆడమన్నట్టల్లా కేసీఆర్ ఆడుతున్నారని ప్రియాంక విమర్శించారు.
కులగణనకు BJP ముందుకు రావట్లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ అన్నారు. రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇంతవరకూ చూడలేదని, దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. నీతిమంతమైన ప్రభుత్వం నడిపిస్తామని చెప్పి విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల అక్రమాలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత విమర్శలు చేశారు.