
Published 23 Dec 2023
మోదీ సర్కారును గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంకను ఒక రాష్ట్ర ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించే సాహసం చేసింది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్(UP) ఇంఛార్జిగా ప్రియాంక వాద్రాను తొలగిస్తూ AICC నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాల ఇంఛార్జిలను మార్చింది. రాజస్థాన్ డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ కు ఛత్తీస్ గఢ్… రమేశ్ చెన్నితాలకు మహారాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టింది. ప్రియాంకను తొలగించడమే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఆమెకు ఇతర రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పకుండా కేవలం జనరల్ సెక్రటరీగానే కంటిన్యూ అవుతారని పార్టీ తెలిపింది. ప్రస్తుతం యూపీ బాధ్యతలు చూస్తున్న అవినాశ్ పాండేను పూర్తిస్థాయి ఇంఛార్జిగా నియమించారు.
అందుకే కఠిన నిర్ణయమా…
సీడబ్ల్యూసీ(Congress Working Committee) సమావేశం జరిగిన రెండో రోజునాడే ప్రియాంకను తొలగిస్తూ నిర్ణయం వెలువడింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నిర్వహించిన CWC భేటీకి సోనియా, రాహుల్ సహా కీలక నేతలంతా హాజరయ్యారు. తెలంగాణ ఇంఛార్జిగా ఉన్న మాణిక్ ఠాక్రేను గోవా, డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలికి పంపించారు. తెలంగాణ కొత్త ఇంఛార్జిగా దీపా దాస్ మున్షీ రానుండగా.. కేరళ, లక్ష్యద్వీప్, అండమాన్ బాధ్యతల్ని కూడా చూస్తారు. సీనియర్ నేతలు జైరామ్ రమేశ్ కమ్యూనికేషన్, కె.సి.వేణుగోపాల్ ఆర్గనేజేషన్ బాధ్యతల్ని చూడనున్నారు. వారణాసి నుంచి గెలిచిన మోదీని ఎదుర్కోవాలంటే గట్టి పోటీదారును తయారు చేయాలన్న సంకల్పం విపక్ష ‘ఇండియా కూటమి’లో కనిపిస్తోంది. అందుకే ప్రియాంకను యూపీ బాధ్యతల నుంచి తొలగించారు. మోదీపై పోటీకి ప్రియాంక లేదంటే బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను బరిలోకి దింపాలన్న వ్యూహంలో భాగంగానే ఆమెను ఇంఛార్జిగా తొలగించారన్నది టాక్.