అభ్యర్థుల ఎంపికకు(Candidates Selection) కసరత్తు ఫైనల్ కు చేరుకుంటున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేతల్లో(Constituency Leaders) అలజడి మొదలైంది. టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన దృష్ట్యా మీటింగ్ మొదలు కాకముందే పెద్దసంఖ్యలో గాంధీభవన్ కు చేరుకున్నారు. నియోజకవర్గ నేతల అనుచరులు మెట్ల వద్ద నినాదాలు చేశారు. సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమ నేతకే టికెట్ కేటాయించాలంటూ పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. MLC కూచుకుంట్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి టికెట్ కు అప్లయ్ చేసుకోవడంతో ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నారంటూ నాగం అనుచరులు ఆందోళన చేశారు. మెట్లపై కూర్చుని నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలను.. మాణిక్ రావ్ ఠాక్రేతోపాటు రేవంత్ రెడ్డి సముదాయించారు.
లోకల్ వాళ్లకే టికెట్లివ్వాలి
లోకల్ క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వాలంటూ గోషామహల్ కు చెందిన పలువురు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 ST సెగ్మెంట్లు ఉండగా.. జనరల్ సీట్లలోనూ కొన్నింటిని తమ వర్గానికి కేటాయించాలని సదరు కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు PAC మీటింగ్ వద్దకు చేరుకున్నారు. అటు తమ సామాజికవర్గానికి సైతం టికెట్లు కేటాయించాలంటూ కమ్మ కులానికి చెందిన JAC(Joint Action Committee) గాంధీభవన్ వద్దకు చేరుకుంది.
రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ
రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) గాంధీభవన్ లో సమావేశమైంది. మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన మీటింగ్ కు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి అటెండ్ అయ్యారు. బస్సు యాత్ర విధివిధానాలు, అగ్రనేతల పర్యటనకు సంబంధించిన చర్చ జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన దృష్ట్యా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ విషయంలో మిగతా రెండు పార్టీల కన్నా వెనుకబడి ఉన్నందున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో కనపడింది.