పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని.. ప్రెసిడెంట్ పదవి కోసం పనికారానా అంటూ BJP ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన రీతిలో మాట్లాడారు. పార్టీ ప్రెసిడెంట్ పదవి లేదంటే ఫ్లోర్ లీడర్… అదీ కాకుంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చినా ఓకే అన్నారు. గుర్తింపు దక్కకపోతే జేపీ నడ్డాపై ప్రధానికి కంప్లయింట్ ఇస్తానని హెచ్చరించారు. దిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో మాట్లాడిన ఆయన… పార్టీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు… 2 నెలల్లో BJP పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది… దుబ్బాక ఎన్నికల్లో నాకెవరూ సాయం చేయలేదు… నేను BJPలోనే ఉండాలనుకుంటున్నా’నని చెప్పారు.
నడ్డా, సంజయ్ సహా మునుగోడు ఎలక్షన్స్ పై విమర్శలు
మునుగోడు ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని… అదే 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్నని రఘునందన్ అన్నారు. ‘బండి సంజయ్ ది స్వయంకృతాపరాధం.. ఆయన పుస్తెలమ్మి ఎలక్షన్స్ లో పోటీ చేశారు… అలాంటి సంజయ్ రూ.100 కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారు… తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో ఓట్లు రావు… రఘునందన్, ఈటల రాజేందర్ తోనే ఓట్లు వస్తాయి’ అంటూ సంచలన కామెంట్లు చేశారు.
అసలే గత నెల రోజుల నుంచి రాష్ట్ర BJPలో అనుమానాలు, అంతర్గత విభేదాలు నెలకొన్నవేళ.. రఘునందన్ తాజా మాటలు వేడిని పెంచుతాయనడంలో సందేహం లేదు. అసలు BJPలో ఏం జరుగుతోందంటూ ఆ పార్టీ దిగువశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటున్నారు.