
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారుస్తామని ఆ పార్టీ టాప్ లీడర్ రాహుల్ గాంధీ ఖమ్మం జనగర్జన సభలో అన్నారు. అవినీతితో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వారి కుటుంబం కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. వితంతు పింఛను రూ.4,000 ఇస్తామని, ఆదివాసీలకు పోడు భూములు కట్టబెడతామని హామీ ఇచ్చారు. బీజేపీకి BRS బీ పార్టీ అని, ప్రధానమంత్రి చేతిలో రిమోట్ కంట్రోల్ లాంటివారు కేసీఆర్ అని విమర్శించారు.
‘తెలంగాణకు రాజుగా భావించి కేసీఆర్ ఇదంతా తన జాగీరు అనుకుంటారు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్ని కూడా లాక్కున్నారు. అవినీతిలో సీఎంకు ఎవరూ సాటిరారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు మింగారు.. ధరణి పోర్టల్ గురించి భారత్ జోడో యాత్రలో నాకు చెప్పారు. ధరణి ద్వారా భూముల్ని సీఎం ఎలా దోచుకుంటున్నారో తెలుసు.. మిషన్ భగీరథలో వేల కోట్లు మాయం చేశారు.. అన్ని రంగాల నుంచి దోపిడీ పర్వం కొనసాగుతోందని’ రాహుల్ ఆరోపించారు.
కర్ణాటకలో ఎలా బీజేపీని ఓడించారో తెలంగాణలో సైతం అదే విధంగా కేసీఆర్ ను ఓడించాలన్నారు.
అంతకుముందు ఓపెన్ టాప్ కారులో అభివాదం చేస్తూ రాహుల్… జనగర్జన సభకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ఆయన్ను చూసేందుకు భారీగా జనం వచ్చారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని రెండు బుగ్గలపై గద్దర్ ముద్దుపెట్టారు. ఎమ్మెల్యే సీతక్కను భుజం తట్టి అభినందించిన రాహుల్… భట్టి విక్రమార్క పాదయాత్రను కొనియాడారు.