NDA కూటమిపై పోరాడుతూ ఈ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లుల్ని అడ్డుకోవాల్సిన ఇండియా అలయెన్స్ కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ప్రధాన పార్టీల నేతల తిరుగుబాటు ధోరణితో రాహుల్ నాయకత్వం(Leadership) ప్రశ్నార్థకంగా మారింది. మొన్న మమత, శివసేన, ఇప్పుడు లాలూప్రసాద్.. టాప్ లీడర్లంతా రాహుల్ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. కూటమికి మమతనే నేతృత్వం వహించాలని, ఆమెకు ఫుల్ సపోర్ట్ అంటూ లాలూ ప్రకటించారు. మొన్న ఉప ఎన్నికల్లో బెంగాల్లో అన్ని సీట్లు గెలిచిన వెంటనే మమత సైతం అలాగే మాట్లాడారు. ‘లీడర్ షిప్ ను అందరూ కోరుకుంటారు.. బెంగాల్ ను విడిచి వెళ్లడం తన ఉద్దేశం కాదు.. కూటమిని ఏకం చేసే బాధ్యత తీసుకుంటా..’ అని అన్నారు. శివసేన(UBT) నేత సంజయ్ రౌత్ తోపాటు శరద్ పవార్ సైతం ఆమెకే మద్దతు పలికారు.
పార్లమెంటు రోజూ వాయిదా పడటం పార్టీలకు ఇబ్బందిగా తయారైంది. అదానీ అంశంపై JPC డిమాండ్ తో సభ వాయిదా పడటంపై సమాజ్ వాదీ, తృణమూల్ అసంతృప్తితో ఉన్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ వంటివి దేశంలో ఎన్నో అంశాలుంటే కేవలం అదానీపైనే రాహుల్ పట్టుబట్టడం మిగతా నేతలకు మంటగా తయారైంది. 2019 కన్నా 2024 పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ మేర సీట్లు(99) సాధించిన హస్తం పార్టీ.. తన తీరును మాత్రం మార్చుకోవడం లేదన్న గుర్రుతో మమత, అఖిలేశ్, లాలూ, రౌత్ ఉన్నారు. BJPని ఓడించాలన్న సింగిల్ టార్గెట్ తో ఫామ్ అయిన ఇండీ కూటమి.. సిద్ధాంతాల్లో మాత్రం ఒకటి కాలేకపోతున్నాయి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ చట్టం వంటి కీలక అంశాలపై పోరాటం చేయాల్సిన విపక్ష పార్టీలు.. మమతకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా రాహుల్ నాయకత్వాన్ని కన్ఫ్యూజన్ గా మార్చాయి.