
24 గంటల ఉచిత విద్యుత్ కు ఏటా రూ.16,500 కోట్లు ఖర్చవుతాయని, రైతులకు కేవలం 8 నుంచి 11 గంటలే ఇస్తున్నందున అందులో సగం ఎటు పోతోందని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్ ను సింగిల్ ఫేజ్ గా ఇస్తున్నట్లు సాక్షాత్తూ ట్రాన్స్ కో సీఎండీ గతంలోనే చెప్పారని, రైతులకు త్రీ ఫేజ్ కరెంటుపై నియంత్రణ పాటిస్తున్నామన్నామని CMDయే చెప్పడాన్ని గుర్తు చేశారు. త్రీఫేజ్ ను 8 నుంచి 11 గంటలే ఇస్తే రూ.16,500 కోట్లలో రూ.8,500 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని, మరి ఏటా మిగతా రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తాను ఏదో మాట్లాడానని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ KTRను విమర్శించారు. 24 గంటల ఉచిత కరెంటును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రజలను KCR మోసం చేస్తున్నారన్నారు.
లాగ్ బుక్ లోని ఇన్ఫర్మేషన్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టిన తర్వాత రాష్ట్రంలోని 3,500 సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్ లను సీజ్ చేసిన ప్రభుత్వం వాటిని వెనక్కు తెచ్చుకుందని ఆరోపించారు. ప్రస్తుతం సబ్ స్టేషన్లలో తెల్ల కాగితాల మీద లెక్కలు రాసే దివాళాకోరుతనం కనపడుతోందన్నారు. ఉచిత కరెంటును అవినీతికి వాడుకుంటూ KCR సర్కారు ప్రజలను మభ్యపెడుతోందని రేవంత్ వివరించారు. దీనిపై ఏ రైతు వేదికపైనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. సిరిసిల్లకా, చింతమడకకా, గజ్వేల్ కా.. ఎక్కడంటే అక్కడికి చర్చకు రావడానికి సిద్ధమని సవాల్ విసిరారు.