
బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తీసేశారు… కిషన్ రెడ్డిని అధ్యక్షుణ్ని ఎందుకు చేశారు.. KCR, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఇగ కిషన్ రెడ్డి గురించి చెప్పాలె.. మనం వినాలె.. ఎందుకు నియమించిండ్రో ఆయనను చెప్పమనుండ్రి అధ్యక్షుడిగా.. పోనీ బండి సంజయ్ ను ఎందుకు తీసిండ్రో ఆయనను చెప్పమనుండ్రి.. మేము కేసీఆర్ అనుచరులు మాట్లాడే దాని మీద మాట్లాడము.. కేసీఆర్, కిషన్ రెడ్డి వేరు వేరు కాదు.. కాబట్టి KCR అనుచరుడైన కిషన్ రెడ్డి కేసీఆర్ భాషనే మాట్లాడుతారు.. CWC సమావేశాలు జరుగుతున్నాయనే వీటిని అడ్డుకునేందుకే BRS, BJP, MIM ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి’ అని రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం అంటూ హడావుడి తప్ప ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలో పాలమూరు లిఫ్ట్ పై కేసు వేసిన ప్రస్తుత MLA హర్షవర్ధన్ రెడ్డిని పక్కన బెట్టుకుని లిఫ్ట్ ను స్టార్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. దానిపై కేసులు వేయించిందే CM అని అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు KCR కుటుంబంపై ఈగ వాలలేదని, అన్ని ఏజెన్సీలు మీవే కదా అని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం సరిపోలేదని లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్షాల్లోని అందరిపైనా BJP కేసులు పెట్టింది కానీ.. కేసీఆర్ కు కనీసం ఇప్పటివరకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదన్న ఆయన.. తానే ఎన్నో కంప్లయింట్లు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.