ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగం… రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బిల్లు రూపకల్పన ప్రక్రియకు సంబంధించి ఆర్టీసీకి వచ్చే ఆదాయంపై రెండేళ్ల మారటోరియం విధించే అవకాశముంది. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయాన్ని తీసుకోకుండా TSRTC అవసరాలకే వినియోగించనుంది. ఈ చట్టం అమలైన సమయం నుంచి ఉద్యోగుల వేతనాల్ని(Salaries)ను సర్కారే చెల్లిస్తుంది. రెండేళ్ల తర్వాత ప్రతి నెలా ఆదాయంలో 25 శాతం ప్రభుత్వం తీసుకోనుంది. భూములు, బస్సులు కార్పొరేషన్ పరిధిలోనే ఉండనుండగా… ప్రస్తుతం 43,377 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎన్నికలు వచ్చాయనే RTCపై ప్రేమ: విపక్షాలు
ఎన్నికలు వచ్చినందునే RTCపై ప్రభుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చిందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని అంటున్నాయి. విలీనం చేయడంతోనే సరిపోదని, కార్మికుల సంక్షేమం కూడా చూడాల్సి ఉంటుందని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల వల్లే సీఎంకు RTC గుర్తుకు వచ్చిందని YSRTP అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించి 29 మంది ప్రాణాలు తీశారని అన్నారు.