
Published 28 Dec 2023
రానున్న లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో అడుగుపెట్టిన ఆయన.. మొన్నటి ఎన్నికల వ్యవహారశైలిపై పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శ్లోక కన్వెన్షన్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన అమిత్ షా.. పార్లమెంటు ఎన్నికలకైనా(Parliament Elections) చిల్లర మల్లర వేషాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వర్గ విభేదాలు లేకుండా కలసికట్టుగా పనిచేస్తేనే మూడోసారి పగ్గాలు చేపడతామని గుర్తు చేశారు.
గ్రూపు రాజకీయాలే…
‘గ్రూపు రాజకీయాల వల్లే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాం.. ఇది మమ్మల్ని ఎంతో బాధించింది.. తెలంగాణలో 30 సీట్ల దాకా వస్తాయని అనుకున్నాం.. కానీ అనుకున్నది నెరవేరలేదు.. విభేదాలకు తావు లేకుండా పనిచేయకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది.. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రతి ఒక్కరూ ఇకనైనా బాధ్యతతో నడచుకోవాలి’ అంటూ పార్టీ లీడర్లకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.
సిట్టింగ్ లకే మరో అవకాశం..
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ MPలకు మరోసారి అవకాశం కల్పిస్తామని, మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు అమిత్ షా తెలియజేశారు.
మొన్నటి ఎన్నికల మాదిరిగా చివరి సమయంలో కాకుండా ఈసారి అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఆర్నెల్ల క్రితం BJPకి మంచి అవకాశాలు కనిపించినా, అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. BRSకు అడ్డుకట్ట వేసేలా సీట్లు సాధించాలని చూసినా రాష్ట్ర కేడర్ నిర్లక్ష్యం వల్ల కమలం పార్టీకి పెద్దగా సీట్లు దక్కకుండా పోయాయి.