దళితబంధు స్కీమ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడానికి సిద్ధమైన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను.. పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. బయటకు రాకుండా ఇవాళ పొద్దున్నుంచే ఆమె నివాసమైన లోటస్ పాండ్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. కానీ టూర్ కు పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేశారు. గజ్వేల్ వెళ్లి తీరుతానంటూ ఖాకీలతో షర్మిల వాగ్వాదానికి దిగారు. బయటకు వస్తున్న YSRTP అధ్యక్షురాలిని అడ్డుకోవడంతో అటు కార్యకర్తలు, ఇటు పోలీసుల మధ్య గందరగోళం ఏర్పడింది. రెండు వర్గాల తోపులాటతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. చివరకు చేసేది లేక షర్మిల.. ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగారు.
దీనిపై షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసులు KCRకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, సాయంత్రం వరకు దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికే పాలిటిక్స్ లోకి వచ్చానని, వారిని కలవడానికి పర్మిషన్ తీసుకోవాలా అంటూ మండిపడ్డారు. నన్ను చూసి KCR భయపడుతున్నారంటూ షర్మిల కామెంట్స్ చేశారు.