ప్రధాని నరేంద్రమోదీ ఈసారి టూర్ తో ఏళ్ల నాటి కల నెరవేరినట్లయింది. పాలమూరు పర్యటన సందర్భంగా తెలంగాణకు వరాలు కురిపించిన ఆయన… జాతీయ పసుపు బోర్డుతోపాటు ములుగు జిల్లాకు కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి కరోనా తర్వాత పసుపు వాడకం, గొప్పదనంపై ప్రపంచానికి అవగాహన ఏర్పడింది. పసుపు చూపించిన ప్రభావం వల్ల దీనిపై విస్తృత స్థాయిలో పరిశోధనలూ పెరిగాయి. తెలంగాణలో పసుపు బాగా పండుతున్నా బోర్డు ఏర్పాటు అంశం ముందుకు కదల్లేని వాతావరణం ఏర్పడింది. కానీ మోదీ ప్రకటనతో రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. సుగంధ ద్రవ్యాల పరిధిలోకి వచ్చే పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఆ పంటను మార్కెట్ చేసుకునే అవకాశం లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఈ బోర్డు ఏర్పాటుపై అధికార BRS, విపక్ష BJP మధ్య ఒకరకంగా యుద్ధమే కొనసాగుతున్నది. నిజామాబాద్ MPగా కవిత ఓటమికి, ధర్మపురి అర్వింద్ గెలవడానికి ప్రధాన కారణంగా పసుపు అంశమే నిలిచింది.
ఇరు పార్టీలకు కొరకరాని కొయ్యలా
ధర్మపురి అర్వింద్ గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా దీనిపై ఉలుకు పలుకూ లేదని BRS విరుచుకుపడుతున్నది. గత రెండు మూడేళ్లుగా ఈ అంశం కమలం పార్టీకి సైతం కొరకరాని కొయ్యలా తయారైంది. దీనిపై హామీ ఇచ్చినా నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు.. భరోసా ఇచ్చినా దాన్ని అమలులోకి తీసుకురాలేని స్థితిలో BJP.. ఇలా రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే కొనసాగుతున్నది. గత కొన్ని నెలలుగా పసుపు రైతులు సైతం కమలం పార్టీపై గుర్రుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్చిన మాటను అర్వింద్ నిలుపుకోలేకపోతున్నారని, కేంద్ర పెద్దల వద్ద కనీసం బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో పాలమూరు సభకు హాజరైన ప్రధాని.. పసుపు బోర్డు ప్రకటించడంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక రకంగా పసుపు రైతులకు ఇచ్చిన హామీని ప్రధాని మాటతో నెరవేర్చినట్లయింది.