తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(Lieutenant Governor)గా పనిచేసి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్… తన మాతృ సంస్థ భారతీయ జనతాపార్టీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు పార్టీ చీఫ్ కె.అన్నామలై ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆమె రాజీనామా(Resignation)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించడంతో తమిళిసై చేరికకు మార్గం సుగమమైంది.
సుదీర్ఘకాలం…
2019 సెప్టెంబరు 8న తెలంగాణ గవర్నర్ గా నియమితులైన ఆమె.. 2021 ఫిబ్రవరి 18న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణకు నాలుగున్నరేళ్లకు పైగా, పుదుచ్చేరికి మూడేళ్లకుపైగా సేవలందించిన ఆమె.. ఈ నెల 18న ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వరాష్ట్రం తమిళనాడు నుంచి ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీకి దిగబోతున్నారు.
గతంలో ఓటములే…
గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన తమిళిసైకి చేదు జ్ఞాపకాలే మిగిలాయి. 2011లో వేలచ్చేరి, 2016లో విరుగంబాక్కం నియోజకవర్గాల(Constituencies) నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా ఓటములు తప్పలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ట్యూటికోరిన్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి కుమార్తె కనిమొళి చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో బరిలోకి దిగాలని గతేడాది నుంచే ఆమె ఆలోచన చేస్తున్నారు.