రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న గ్యారంటీలు, కొత్తగా ప్రారంభించబోయే పథకాల(Schemes) విషయంలో క్రమంగా క్లారిటీ రాబోతున్నది. ఈ నెల 11 నాడు రెండు అత్యంత ప్రాధాన్య కార్యక్రమాల(Programmes)ను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అదే రోజున ప్రారంభించనున్న సర్కారు… కేబినెట్ భేటీని కూడా నిర్వహించబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాగే ఈ మీటింగ్ ద్వారా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
షెడ్యూల్ వచ్చే వేళ…
ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మిగతా గ్యారంటీల విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆరు గ్యారంటీల్లో 13 అంశాలు ఉంటే అందులో ఇప్పటికే కొన్ని అమలవుతున్నాయి. విద్యానిధి, రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కేటాయింపు వంటి అంశాలు(Issues) చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
రూ.2,500పై…
ఇక మహిళలకు రూ.2,500 ఇస్తామని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇది ఇప్పటివరకు అమలు కాకపోవడంతో విపక్ష BRS విమర్శలు స్టార్ట్ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీయే కాకుండా మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తారా, లేదా అని డిమాండ్ చేసింది. దీంతో కేబినెట్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిధుల్ని ఎలా సమీకరించాలన్న దానిపైనా చర్చ జరిగే అవకాశమున్నట్లు కనపడుతున్నది.