పార్టీ టికెట్ల కోసం అభ్యర్థులు అప్లయ్ చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికను BJP షురూ చేస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ టైమ్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 4 నుంచి 10 వరకు సమయం కేటాయించింది. అప్లయ్ చేసుకునే క్యాండిడేట్స్ పూర్తి డీటెయిల్స్ అందజేయాలని సూచించింది. రాష్ట్రంలో ఇప్పటికే అభ్యర్థుల్ని అధికార పార్టీ BRS ప్రకటించగా.. అందుకు సంబంధించిన కసరత్తులో కాంగ్రెస్ పార్టీ తలమునకలై ఉంది. ఇక అభ్యర్థుల వేటలో సీరియస్ గా ఉన్న BJP సైతం కార్యక్రమాన్ని షురూ చేసింది.
BRS, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులు తమ వైపు చూస్తారని ఆశించిన కమలం పార్టీ పెద్దలకు ఇప్పటివరకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ రానున్న రోజుల్లో ఇది కచ్చితంగా వర్కవుట్ అవుతుందన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనపడుతోంది. ఇప్పటికే BRSలో ఫుల్ బోర్డు కనిపించగా… హస్తం పార్టీలోనూ సొంత లీడర్లు, బయట నుంచి వచ్చిన వారితో ఫుల్ డిమాండ్ కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయమన్న రీతిలో నేతలను ఆకర్షించే పనిలో పడుతున్నట్లు అర్థమవుతుంది.