Published 04 Dec 2023
ప్రమాణ స్వీకార వేదిక మారనుందా…!
ముందు చెప్పినట్లు ఎల్.బి.స్టేడియం కాదా…!
రాజ్ భవన్ లోనే ఏర్పాట్లు జరుగుతున్నాయా…!
ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమేనని అనిపిస్తున్నాయి. విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీ ఇక ప్రమాణ స్వీకారానికి(Oath) రెడీ అవుతున్నది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన మేరకు హస్తం పార్టీ ప్రమాణ స్వీకారం ఈనెల 9న ఎల్.బి.స్టేడియంలో జరగాల్సి ఉంది. కౌంటింగ్ అనంతర పరిణామాలతో అంతదాకా ఎందుకున్న ఉద్దేశంతో ఆ పార్టీ ముఖ్య నేతలంతా రిజల్ట్స్ వచ్చిన్నాడే గవర్నర్ ను కలిశారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ సౌందరరాజన్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రమాణస్వీకారాన్ని ఎల్.బి.స్టేడియానికి బదులు రాజ్ భవన్ లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది.
సీఎల్పీ సమావేశం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తిని ముందుగా CLP(Congress Legislative Party) నాయకుడిగా గుర్తించాలి. నాయకుడిగా ఎన్నుకోవాలంటే ముందుగా CLP సమావేశం ఏర్పాటు చేసి సీనియర్ నేతల మధ్య MLAలందరితో సమావేశం నిర్వహించే సంప్రదాయం ఉంది. ఆ మేరకు కొద్దిసేపట్లో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో ఈ భేటీ జరగనుండగా.. ఆ మీటింగ్ లోనే రేవంత్ ను CLP నేతగా ప్రకటించనున్నారు. అనంతరం ఈ విషయాన్ని గవర్నర్ కు చేరవేసిన తర్వాత ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది.