
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘విశ్వకర్మ యోజన’ స్కీమ్ అంటే ఏమిటి… దాని ద్వారా ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది.. మొత్తంగా ఎన్ని రకాల వృత్తిదారులకు లోన్లు ఇస్తారు.. అనేది తెలుసుకుందాం. పంద్రాగస్టు నాడు ఎర్రకోటపై ప్రసంగంలో మోదీ.. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని గుర్తుచేశారు. అనుకున్నట్లుగానే కేంద్ర కేబినెట్ మీటింగ్ లో దానికి ఆమోదం లభించింది. ఈ పథకం విశ్వబ్రాహ్మణుల్లోని పంచకులాలతోపాటు నేత, చాకలి, మంగలి కులాలకు వర్తిస్తుంది. అంటే ఈ కులాల్లో చేతివృత్తులపై ఆధారపడే వారికి మాత్రమే ‘విశ్వకర్మ’ ద్వారా సబ్సిడీ లోన్లు అందిస్తారు. ‘విశ్వకర్మ’ జయంతి అయిన సెప్టెంబరు 17న దీన్ని ప్రారంభించనుండగా OBCల్లోని సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడే వారికే ఈ లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇందుకోసం రూ.13,000 నుంచి 15,000 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. సెలెక్ట్ అయిన కళాకారులు, చేతివృత్తిదారులకు గుర్తింపుగా PM ‘విశ్వకర్మ’ సర్టిఫికెట్(Certificate)తోపాటు ID కార్డ్ ఇస్తారు. స్కిల్స్ ను డెవలప్ చేసుకోవడం, టూల్ కిట్ అందివ్వడం, డిజిటల్ ట్రాన్జాక్షన్స్(Digital Transactions)పై అవగాహన కల్పించడం ఈ స్కీమ్ ఉద్దేశం.
2023-24 నుంచి 2024-28 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అయిదేళ్ల పాటు స్కీమ్ కంటిన్యూ చేస్తారు. మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుండగా.. తొలి ఏడాది 5 లక్షల మందికి స్కీమ్ ను వర్తింపజేస్తారు. గురు-శిష్య పరంపరలో భాగంగా మొత్తం 18 రకాల చేతివృత్తుల నైపుణ్యాలను సానబెట్టడం, విస్తృతపరచడంతోపాటు వరల్డ్ వైడ్ గా ఆదరణ కల్పించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేస్తున్నారు. గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, శిల్పి, కార్పెంటర్, పడవల తయారీదారులు, ఆయుధాల తయారీ, సుత్తి, నేత, టూల్ కిట్ మేకర్, తాళాల తయారీ, కుమ్మరి, ఒడ్డెర, చెప్పులు కుట్టేవారు, తాపీ మేస్త్రీ, మంగలితోపాటు మరిన్ని కులాలకు ‘విశ్వకర్మ యోజన’ వర్తించనుంది.