స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆడించకపోవడం విస్మయం కలిగించిందని సచిన్ అన్నాడు. ఆ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని.. ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్ గా కొనసాగుతున్న అశ్విన్ ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదన్నాడు. ఫైనల్ కు జట్టు ఎంపిక, ఆటతీరుపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “సీమర్లకు సహకరించే పిచ్ అని చెప్పి అశ్విన్ ను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నైపుణ్యం గల స్పిన్నర్లు టర్నింగ్ ట్రాక్ లపై ఆధారపడకుండా పరిస్థితుల మేరకు బంతుల్ని ఉపయోగిస్తారు. ఆసీస్ జట్టులో ఐదుగురు ఎడమ చేతి వాటం ఆటగాళ్లున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని సచిన్ వివరించాడు. రెండేళ్ల డబ్ల్యూటీసీ సైకిల్ లో భాగంగా అశ్విన్ 13 టెస్టుల్లో 61 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు కీలక సమరంలో చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.