ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో శుభ్ మన్ గిల్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామెరూన్ గ్రీన్ అందుకున్న ఆ బంతి నేలకు తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. మూడో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగగా, గ్రీన్ స్పందించాడు. ” నేను సరిగ్గానే క్యాచ్ అందుకున్నట్లు భావించి బంతిని పైకి విసిరా.. అప్పుడు నాకెలాంటి అనుమానం కలగలేదు. నిర్ణయం థర్డ్ అంపైర్ వరకు వెళ్లి ఔట్ గా ప్రకటించారు. స్లిప్స్ లో క్యాచ్ లు పట్టడంపై తీవ్రంగా శ్రమిస్తున్నా’ అని గ్రీన్ అన్నాడు. స్కాట్ బోలాండ్ వేసిన ఓవర్ తొలి బంతిని ఆడబోయి గిల్(18) ఇచ్చిన క్యాచ్ ను గల్లీలో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకున్న తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఫీల్ట్ అంపైర్లు మూడో అంపైర్ ను సంప్రదించారు. దీనిపై వివిధ కోణాల్లో పరిశీలిస్తున్న సమయంలో గ్రీన్ చేతిలోని బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. గిల్ నిరాశగా పెవిలియన్ చేరగా.. భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెరూన్ గ్రీన్ ను ఉద్దేశిస్తూ ఛీటింగ్, ఛీటింగ్ అంటూ నినాదాలు చేశారు.
Good article