డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కు రెండోసారి నిరాశే ఎదురైంది. ఈసారైనా టైటిల్ గెలిచి గద అందుకోవాలన్న లక్ష్యాన్ని సాకారం చేసుకోలేకపోయింది. ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఘోర పరాభవం తప్పలేదు. ఐసీసీ టోర్నీల్లో తుది మెట్టుపై బోల్తా పడే అలవాటును టీమిండియా పునరావృతం చేసుకుంది. కీలకమైన పోరులో తడబాటుకు గురై ట్రోఫీ సుదీర్ఘ కాల నిరీక్షణను కొనసాగిస్తూనే ఉంది. 444 పరుగుల ఛేదనలో ఐదో రోజు 164/3తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్… ఆసీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీలో భారత జట్టు నాసిరకపు ప్రదర్శన చేసి ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ అయి ప్రత్యర్థికి 173 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ను కట్టడి చేసినా ఆ జట్టు 8 వికెట్లకు 270 వద్ద డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజునాడే 3 వికెట్లు కోల్పోయింది. అప్పటికి కోహ్లి, రహానే క్రీజులో ఉండటంతో ఆశలు కనిపించాయి. కానీ ఐదోరోజు ఆట మొదలైన కాసేపటికే కోహ్లి.. మరో రెండు బంతులకు జడేజా పెవిలియన్ చేరారు. ఇక భారమంతా రహానె పైనే పడటంతో కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ స్టార్క్ బౌలింగ్ లో కీపర్ కు చిక్కిన రహానె భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి వరుస బ్యాటర్లు, భరత్, షమి తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరి భారత్ పరాజయాన్ని ఖాయం చేశారు. ఎన్నో ఆశలతో ఇంగ్లండ్ పయనమైన టీమిండియా… మరోసారి రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఐసీసీ టోర్నీల్లో తుది మెట్టుపై బోల్తా పడే అపప్రథను తొలగించుకోలేకపోయింది.