
Published 19 Dec 2023
తొలి మ్యాచ్ కోల్పోయి సిరీస్ లో నిలవాలంటే రెండో వన్డే(Second ODI)ను తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో దక్షిణాఫ్రిగా విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ తో జరుగుతున్న సిరీస్ ను సమం చేసింది. టోనీ డి జోజి సెంచరీతో ఆ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి తొలి వన్డేకు ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. 8 వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓపెనర్ సెంచరీ
దక్షిణాఫ్రికాకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్ టోనీ డి జోజి(119; 122 బంతుల్లో 9×4, 6×6) విజృంభించడంతో సఫారీ జట్టు విజయం నల్లేరుపై నడకే అయింది. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ సైతం(52; 81 బంతుల్లో 7×4) ఫిఫ్టీ మార్క్ దాటాడు. వన్ డౌన్ లో వచ్చిన డసెన్(36)తో కలిసి జోజి సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బ్యాటర్లపై టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫస్ట్ వికెట్ ను ఆ టీమ్ 130 పరుగుల వద్ద కోల్పోయిందంటే ఓపెనర్ల నిలకడైన బ్యాటింగ్ ఎలా ఉందో తెలుస్తోంది.
గాడి తప్పిన భారత బ్యాటింగ్
ఓపెనర్ సాయి సుదర్శన్(62; 83 బంతుల్లో 7×4, 1×6), కెప్టెన్ కేఎల్ రాహుల్(56; 64 బంతుల్లో 7×4) రాణించినా మిగత్యా బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియా పెద్దగా స్కోరు చేయలేకపోయింది. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ సాయి సుదర్శన్ వరుసగా రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. రుతురాజ్(4), తిలక్ వర్మ(10), సంజూ శాంసన్(12), రింకూ సింగ్(17), అక్షర్ పటేల్(7) సైతం క్రీజులో నిలవకుండానే వెనుదిరిగారు. 46 స్కోరుకే 2 వికెట్లు పడ్డా సుదర్శన్ తో కలిసి రాహుల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. నండ్రే బర్గర్ 3, హెన్రిక్స్ 2, కేశవ్ 2 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. విలియమ్స్, మార్ క్రమ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో రెండు జట్లు 1-1తో ఉన్నాయి.