వరుసగా రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు నామమాత్ర మూడో వన్డేలో నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగే మ్యాచ్ కు పూర్తిస్థాయి జట్టు బరిలోకి దిగుతున్నది. అయితే వరల్డ్ కప్ దృష్ట్యా ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు రెస్ట్ ఇస్తోంది. అటు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ సైతం మూడో వన్డేకు దూరంగా ఉంటారు. తొలి రెండు వన్డేలకు రెస్ తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ ల్లో పాండ్య మినహా ముగ్గురు జట్టులో చేరారు. హార్దిక్, షమి, గిల్, శార్దూల్ ఇళ్లకు వెళ్లిపోయారు. 15 మంది ఉండాల్సిన జట్టులో ప్రస్తుతానికి 13 మందే కనిపిస్తున్నారు. అక్టోబరు 5 నుంచి అంటే మరో 10 రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న దృష్ట్యా… కీలక ఆటగాళ్లందరికీ ఇంచుమించు రెస్ట్ దొరికినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది.
సూపర్ ఫామ్ లో భారత్… కష్టాల్లో ఆస్ట్రేలియా
టీమ్ఇండియా ప్రస్తుతానికి ఫుల్ జోష్ లో ఉంది. ఆసియా కప్ ను ముద్దాడటం, అగ్రశ్రేణి జట్టయిన ఆస్ట్రేలియాను కీలక ఆటగాళ్లు లేని పరిస్థితుల్లోనూ 2-0తో మట్టికరిపించడంతో రోహిత్ సేన ఆత్మవిశ్వాసం అసాధారణ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ అంతా తలో చేయి వేస్తూ ముందుండి నడిపిస్తున్నారు. గిల్, రాహుల్, శ్రేయస్, సూర్యకుమార్.. ఇలా అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆసీస్ తో రెండో వన్డేలో భారత ప్లేయర్స్ టీ20 మాదిరిగా ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గిల్, శ్రేయస్ లు సెంచరీలు చేస్తే కేవలం 37 బంతుల్లోనే సూర్య 72 రన్స్ చేశాడు. ఈ ముగ్గురితోపాటు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ సైతం తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరోవైపు సిరాజ్, కుల్దీప్ యాదవ్ దడదడలాడిస్తున్నారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ కెరీర్లోనే అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి 3-0తో వైట్ వాష్ చేయాలని భారత్ భావిస్తున్నది.
ప్యాట్ కమిన్స్ ఇన్
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆబ్జెన్సీలో జట్టు పగ్గాలను స్మిత్ స్వీకరించినా ఆ జట్టులో పెద్దగా మార్పు కనపడలేదు. కంగారూ బౌలర్లందరినీ టీమ్ఇండియా ప్లేయర్లు ఉతికి ఆరేశారు. హేజిల్ వుడ్, స్టాయినిస్, జంపా, గ్రీన్ ఇలా అంతా భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆసీస్ ను కలవరానికి గురిచేస్తున్నది. చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవడంతోపాటు వరల్డ్ కప్ కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలన్న కసి కమిన్స్ సేనలో కనపడుతున్నది. మరి పూర్తిస్థాయి బ్యాటర్లతో బరిలోకి దిగుతున్న భారత్ ను ఆస్ట్రేలియా ఏ మేరకు నిలువరిస్తుందో వేచి చూడాల్సిందే. ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరడం ఆస్ట్రేలియాకు కొంతలో కొంత ఊరట. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎలా ఆడతారో చూడాలి. టాప్, మిడిలార్డర్ మాత్రం పెద్దగా రాణించకపోవడం ఆసీస్ ను ఇబ్బందుల పాలు చేస్తున్నది. డేవిడ్ వార్నర్ మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు.