
ఆసియా మెన్స్ ఎమర్జింగ్ కప్ ఫైనల్ లో భారత్(India) ‘A’ ఘోరంగా ఓటమి పాలైంది. పాకిస్థాన్ ‘A’తో జరిగిన మ్యాచ్ లో టార్గెట్ ను రీచ్ చేయలేక చతికిలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. తయ్యబ్ తాహిర్(108; 71 బంతుల్లో 12×4, 4×6) సెంచరీతో చెలరేగడంతో పాక్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆయుబ్(59), ఫర్హాన్(65) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ 2 వికెట్ల చొప్పున.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసుకున్నారు.
టార్గెట్ ఛేదనలో భారత్ యువ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 40 ఓవర్లలో 224 రన్స్ కు ఆలౌట్ అయింది. దీంతో పాక్ 128 పరుగుల తేడాతో కప్ ను కైవసం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ(61; 51 బంతుల్లో 5×4, 1×6) మినహా ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ కు క్యూ కట్టారు. కెప్టెన్ యశ్ ధుల్(39) మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖ్వీమ్ 3, మెహ్రాన్ ముంతాజ్, అర్షద్ ఇక్బాల్, మహ్మద్ వాసిమ్ తలో 2 చొప్పున, ముబాసిర్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు. సెంచరీ చేసిన తయ్యబ్ తాహిర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలవగా, నిశాంత్ సంధు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు.