ఓపెనర్లే గట్టిగా నిలబడటం… తర్వాత బౌలర్లు పనిపట్టడం… ఈ టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్లవే 3 సెంచరీ భాగస్వామ్యాలు(Partnerships)… చురుగ్గా కదిలే ఫీల్డింగ్.. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ జట్టుపైనైనా గెలవాలన్న కసి… ఇవన్నీ అఫ్గానిస్థాన్ అస్త్రాలుగా మారాయి. అందుకే ఆ జట్టు తరచూ సంచలనాలు క్రియేట్ చేస్తుంటుంది.
ఎదురుగా ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్. ప్యాట్ కమిన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో హ్యాట్రిక్ లు తీశాడు. ప్రత్యర్థుల్ని ఆటకు ముందే కంగారూ పెట్టే టీమ్.. ఇవీ ఆసీస్ మ్యాచ్ కు ముందు అఫ్గాన్ లెక్కలు. కానీ 2 హ్యాట్రిక్స్ తీసిన కమిన్స్ సహా హేజిల్ వుడ్, జంపా వంటి క్లాస్ బౌలర్లు 16వ ఓవర్ చివరి బాల్ వరకు వికెట్ తీయలేకపోయారు. అంతలా ఆడారు ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్.
తర్వాత వచ్చేవారు ఎలా ఆడతారో తెలియదు. పవర్ ప్లేతోపాటు తామే గట్టిగా క్రీజులో ఉండాలని అనుకున్నారేమో… అలా గుర్బాజ్, జద్రానే అఫ్గాన్ బ్యాటింగ్ కు ఇరుసులా తయారయ్యారు. అటు నయీబ్, నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ బౌలింగ్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారైంది.
సెమీస్ రేస్ లో…
2 విజయాలతో సెమీస్ రేస్ లో భారత్(96.6%) ముందుంది. అఫ్గాన్ చేతిలో ఓడి సెమీస్ ఆశల్ని కష్టం చేసుకుంది ఆసీస్(57..3%). బంగ్లా ఇంటి దారి పడితే.. రేసులోకి వచ్చింది అఫ్గాన్. రేపటి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్ ఓడి.. జూన్ 25న అఫ్గాన్-బంగ్లా((8.6%)) మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇక ఔటే. కాబట్టి భారత్ పై గెలుపే ఆసీస్ కు ఏకైక మార్గం. అప్పుడు బంగ్లాపై అఫ్గాన్(37.6%) గెలిచినా నెట్ రన్ రేట్ ఆధారంగా మార్ష్ సేనకే అవకాశాలుంటాయి.