
వరల్డ్ కప్ లో అఫ్గానిస్థాన్(Afghanisthan) మూడో విజయాన్ని అందుకుంది. పసికూనగా అడుగుపెట్టి ఇప్పటికే ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఆ జట్టు ఇప్పుడు శ్రీలంక(Sri Lanka)ను మట్టి కరిపించింది. పుణెలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంకేయులు 49.3 ఓవర్లలో 241 రన్స్ కు ఆలౌట్ కాగా.. 45.2 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపును అఫ్గానిస్థాన్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో ఐదో స్థానానికి చేరుకుంది. 6 మ్యాచ్ లకు గాను మూడింట్లో నెగ్గి, మరో మూడింట్లో ఓడిన అఫ్గాన్ 6 పాయింట్లతో శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ కన్నా పై స్థాయిలో నిలిచి ఆశ్చర్యపరిచింది. 6 మ్యాచ్ ల్లో 5 ఓటములతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అట్టడుగు(10వ) స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
మూడు హాఫ్ సెంచరీల అఫ్గాన్
242 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన అఫ్గాన్ ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రహమతుల్లా గుర్బాజ్(0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(39) ఫర్వాలేదనిపించాడు. వన్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(62), హష్మతుల్లా షాహిది(58), అజ్మతుల్లా ఒమర్ జాయ్(73) పోటాపోటీగా ఆడారు. ఎంత ట్రై చేసినా హష్మతుల్లా, అజ్మతుల్లా జోడీని లంక బౌలర్లు విడదీయలేకపోయారు.
ఆశ్చర్యకర రీతిలో నిశాంక ఔట్
మరోవైపు అఫ్గాన్ కు భిన్నంగా లంక బ్యాటింగ్ సాగింది. నిశాంక(46)నే హయ్యెస్ట్ స్కోరర్ కాగా ఆశ్చర్యకర రీతిలో వెనుదిరిగాడు. తన క్యాచ్ పై రివ్యూ కోసం మెండిస్ వద్దకు వెళ్లాడు. కేవలం 1 సెకన్ మిగిలి ఉన్న టైమ్ లో నిశాంక కాకుండా మెండిస్ రివ్యూ కోరాడు. బ్యాటరే రివ్యూ తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదు. కరుణరత్నే(15), కుశాల్ మెండిస్(39), సమరవిక్రమ(36), అస లంక(22), ధనంజయ(14), ఏంజెలో మాథ్యూస్(23), మహీశ్ తీక్షణ(29) ఇలా ఎవరూ పెద్దగా స్కోరు చేయకపోవడంతో 241 రన్స్ వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఒక దశలో 134/3తో ఉన్న ఆ టీమ్ 185కు చేరుకునేసరికి 7 వికెట్లు చేజార్చుకుంది. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారుఖీ 4 వికెట్లు తీసుకోగా అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.