ఒకటేమో డిఫెండింగ్ ఛాంపియన్ కాగా మరోసారి కప్పు అందుకునేందుకు సిద్ధంగా ఉందనేది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా. మరో జట్టు పసికూన. ఆల్ రౌండర్లు, దూకుడైన ఆటతో కూడిన జట్టును పసికూన ఆటాడించింది. దీంతో ప్రపంచకప్ లో పెను సంచలనం(Sensation) నమోదైంది. పసికూన అఫ్గానిస్థాన్(Afghanisthan).. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కు ఊహించని పరాజయం రుచి చూపించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ అఫ్గాన్ కు బ్యాటింగ్ అప్పగించగా ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు పూర్తి ఓవర్లు ఆడకుండానే 40.3 ఓవర్లలో 215 రన్స్ ఆలౌట్ అయి 69 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్(80), కీపర్ ఇక్రమ్ అలిఖిల్(58) హాఫ్ సెంచరీలతో రాణించడంతో అఫ్గాన్ మంచి స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నారు.
టార్గెట్ సాధించడంలో ఇంగ్లండ్ పూర్తిగా విఫలమైంది. హ్యారీ బ్రూక్(66) ఒక్కడే నిలబడగా మిగతా బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. బెయిర్ స్టో(2), మలన్(32), రూట్(11), బట్లర్(9), లివింగ్ స్టన్(10), సామ్ కరణ్(10) ఇలా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టారు. 138 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఏ దశలోనూ కోలుకోలేదు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు, నబీ రెండు వికెట్లు తీసుకున్నారు. ముజీబుర్ రహ్మాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్ లో ఇంగ్లండ్ ఐదో స్థానానికి పడిపోయింది.