క్రికెట్లో చిన్న దేశమే అయినా అఫ్గానిస్థాన్ వ్యూహం(Strategy) అదుర్స్ అనేలా ఉంది. అజయ్ జడేజా(భారత్), డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), యూనిస్ ఖాన్(పాక్).. ఇలా కొత్త మెంటార్లతో పెద్ద జట్లను ఓడించేలా తయారైంది. ప్రతి టోర్నీకి ఆ దేశానికి చెందిన మాజీలను మెంటార్లు చేసుకోవడమే అఫ్గాన్ విజయ సూత్రం. గత మూడేళ్లుగా ఐసీసీ ఈవెంట్స్ ల్లో ఆ జట్టు అద్భుత క్రికెట్ ఆడుతోంది. శ్రీలంక, వెస్టిండీస్ కు భిన్నంగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. 2023 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, పాక్, లంకను ఓడించి ఆస్ట్రేలియాకు దడ పుట్టించింది. ఈ టోర్నీ భారత్ లో జరిగింది కాబట్టి మెంటార్ గా జడేజా ఉన్నాడు.
2024 టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికాలో నిర్వహించారు. ఆ టైంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ను అఫ్గాన్ ఓడించగా.. బ్రావో మెంటార్ గా ఉన్నాడు. తాజా ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లో జరిగింది కాబట్టి యూనిస్ ఖాన్ ను మెంటార్ గా నియమించుకున్నారు. కేవలం కోచ్ లు, మెంటార్ల వల్లే ఇలా ఆడుతుందని చెప్పలేం కానీ, పెద్ద టోర్నీలు జరిగే దేశాలకు చెందిన మాజీలు ఉండటం కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇలా ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మారుస్తూ అఫ్గాన్ విజయాల బాటలో వెళ్తోంది.